ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ దిశగా సీఎం జగన్‌ అడుగులు

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం పైన బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష చేపట్టారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పిల్లలు ఏం తింటున్నారో గమనించాలన్నారు. ఆ తర్వాత వారికి అందించే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై సూచనలు చేయాలని కోరారు. ఇందుకోసం షోషకాహారంలో నిపుణులైన వారి సలహాలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌  అధికారులకు సూచించారు.


మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణలో భాగంగా.. మొదటి దశలో రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ప్లాన్‌ ప్రాంతాల్లోని గర్భవతులు, 6 ఏళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచాలని.. దీనిని పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. 77 గిరిజన, సబ్‌ప్లాన్‌ మండలాల్లో డిసెంబర్‌ నుంచి ఈ పైలట్‌ ప్రాజెక్టు అమలు కానుంది.